చిత్రమాలిక

10, జనవరి 2014, శుక్రవారం

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది - ఆఖరి భాగం

ఒకసారి ఏవో కబుర్ల సందర్భంగా వాళ్ళ పెళ్ళి ప్రస్తావన వచ్చింది.రామకృష్ణగారు " నరసరాజు గారూ! నేను ఆమెను చేసుకోలేదు ఆమే నన్ను చేసుకుంది " అని పకపకా నవ్వారు.ఆమె ఆయనవంక చురచురా చూసి మళ్ళీ నావైపు తిరిగి నరసరాజు గారూ ఇంత పిరికి మనిషిని మీరు ఎక్కడా చూడరు.నేను కృష్ణప్రేమ చినిమాలో నటిస్తున్నప్పుడు ఈ మహానుభావుడి తొలి పరిచయం.ఎందుకో చెప్పలేను లవ్ ఎట్ పస్ట్ సైట్ అంటారే అలాగ ఆయన ప్రేమలో పడ్డాను.పైగా డీరక్టర్ హెచ్.వి.బాబు గారు,గాలిపెంచల నరసింహారావు గారు, తాపీ ధర్మారావు గారు యూనిట్‌లో అందరూ ' రామకృష్ణ చాలా మంచివాడు,మంచివాడు అని ఒకటే పొగడ్తలు ' ఈయన మాత్రం మహామునిలాగ తన పనేమిటో తనేమిటో అంతే. నేను ప్రేమిస్తున్నట్లు ఎన్ని సంకేతాలు ఇచ్చినా నో రెస్పాన్స్.

రోజులు గడుస్తున్నకొద్ది నాలో టెన్షన్.ఎందుకంటే ఇంటిదగ్గర మా అమ్మానాన్న నాకు సంబంధాలు చూస్తున్నరు.ఒక సంబంధం దాదాపు ఖాయం చేసినట్టున్నారు.పోనీ ధైర్యం చేసి ఈయన విషయం మా నాన్నకు చెబుదామంటే ఈయన ఆయనకు నచ్చడని నాకు గట్టి నమ్మకం.మా నాన్నకు ఆస్తిపరుడు,ఆజానుబాహువు,సంగీతప్రియుడు ఇంకా ఏవేవో క్వాలిఫికేషన్స్ ఉన్న అల్లుడు కావాలి.ఈయనలో అవేమి లేవు.ఆస్తిపరుడు కాదు.నెలకు వచ్చే జీతం తప్ప వేరే ఆస్తి లేదు.ఆజానుబాహువు అసలే కాదు.నా కంటే ఒక్క అంగుళం పొడగు.

ఇంక ఊరికే ఉంటే లాభం లేదని ఒకరోజు సాయంత్రం చీకటిపడిన తర్వాత రిక్షాలో బయలుదేరి ఈయనగారి రూంకి వెళ్ళాను.నేను గదిలో అడుగు పెట్టగానే ఈయనకు కంగారు,చెమటలు.నేను సిగ్గు విడిచి చెప్పాను.పెళ్ళి చేసుకుందాం అని.ఈయనగారి రియాక్షను చూడాలి.

ఇదుగో చూడమ్మాయ్ బాగా ఆలోచించుకో నువ్వు స్టార్‌వి.నేను ఎడిటర్‌ని.నాకు వచ్చే జీతం నెలకు యాభై రూపాయలు.దానితో నిన్ను ఎలా పోషించగలను.బాగా ఆలోచించుకో.

ఇవండి ఈయన చెప్పిన సలహాలు,నీతులు.తనంతట తాను సిగ్గువిడిచి ఒక ఆడపిల్ల వచ్చి పెళ్ళి చేసుకోమంటే ఇలా ఏ మగాడైనా మాట్లాడతాడండీ?.రామకృష్ణగారు చిరునవ్వుతో వింటూ కుర్చున్నారు.

నేను సామాన్యంగా అత్యంత ఆత్మీయులు , సన్నిహితులు అయినవారు పోయినప్పుడు వెళ్ళి వాళ్ళ శవాలను చూడటానికి ఇష్టపడను.ఎంతో తప్పనిసరి అయితే తప్ప.శవాన్ని చూస్తే ఆ దృశ్యం బతికినన్నాళ్ళు మనసులో మిగిలిపోతుంది.చూడకపోతే ఏమోలే ఎక్కడో ఉన్నారులే అనిపిస్తుంది.

అలాగే ఇప్పుడు భానుమతిగారు దివంగతురాలైనా నా దృష్టిలో ఆమె ఆ ఇంట్లో ఉనంట్లు,నేనూ ఆమె కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలే జ్ఞాపకం ఉంటాయ్.కాబట్టి నా దృష్టిలో భానుమతి గారు సజీవురాలే.

**************** సమాప్తం ********************

2 కామెంట్‌లు: