చిత్రమాలిక

26, అక్టోబర్ 2013, శనివారం

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది - అయిదవ భాగం

మదరాసులో వైద్య రామయ్యర్ వీధిలో భానుమతిగారి ఇళ్ళు మా ఇంటికి చాలా దగ్గర.కారులో 5 నిమిషాల డ్రైవ్.నాకు ఖాళీ దొరికినప్పుడల్లా వాళ్ళింటికి వెళుతుండేవాడిని.రామకృష్ణ గారికి ఒంట్లో బాగుండక క్లబ్బుకు వెళ్ళడం మానేశారు.ఇంటి దగ్గరే ఉండేవారు.

ఒక్కొక్కసారి నేను వెళ్ళి డ్రాయింగు రూములో కుర్చోగానే భానుమతిగారు నౌకర్ని పిలిచేవారు.వాడు రాగానే నాతో నరసరాజు గారు టిఫిన్ ఏం తెపించమంటారు.ఉస్మాన్‌రోడ్లో మంచి హొటలు టిఫిన్లు బ్రహ్మాండంగా చేస్తాడు. అనేవారు.

నేను నాకేమి వద్దండి అంటే ఆమె భలేవారే మీ పేరు చెప్పుకుని నేను తిందామని చూస్తుంటే మీరు అక్కరలేదంటే నా ఉసురు తగులుతుంది అని పకపకా నవ్వేవారు. సరే అయితే తెప్పించండి అనేవాణ్ణి.ఆమె నౌకరుతో చెప్పేవారు.మసాలా దోశెలు,రవ్వ ఇడ్లీలు ,పెరుగు వడలు అందరికి సరిపడా తీసుకురా అని వంద రూపాయలు నోటు ఇచ్చి పంపేవారు.

పక్కనే కూర్చుని ఉన్న రామకృష్ణగారు వ్యంగ్యంగా మసాలా దోశెలు,వడలు తిను బరువు తగ్గుతావు అని లేచి తన గదివైపు వెళుతుంటే ఆమె మీరు ఎలాగు తినలేరు.తినేవాళ్ళను చూసి ఎందుకంత అసూయ అనేవారు.ఆయన మాట్లడకుండా పక్కనే తన గదిలోకి వెళ్ళి పడుకునేవారు.టిఫిన్‌లు వచ్చేవి.అందరికి ప్లేట్లలో ఆమె స్వయంగా వడ్డించి ఇచ్చేవారు.

2 వ్యాఖ్యలు: