చిత్రమాలిక

6, మే 2011, శుక్రవారం

55 వసంతాల చింతామణి


‘మోహం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది’, ‘ఎవరి పిచ్చి వారికి ఆనందం’ అనే సత్యాలను ప్రతిబింబించే విధంగా నిర్మించిన భరణీ సంస్థ వారి మకుటాయమానమైన తెలుగు చిత్రరాజం ‘చింతామణి’ విడుదలై 55 వసంతాలను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 11వ తేదీ నాటికి ‘చింతామణి’ 56వ వసంతంలోకి అడుగిడింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి ‘చింతామణి’గా అనన్యసామాన్య నటనను ప్రదర్శించిన చిత్రం చింతామణి. భానుమతి నటించిన 22వ చిత్రం ఇది. భానుమతి భర్త రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామకృష్ణ దర్శకత్వంలో ఎన్‌టిరామారావు తొలిసారిగా నటించిన చిత్రం ‘చింతామణి’. ఎన్టీరామారావు, భానుమతిలు కలిసి నటించిన ఎనిమిదవ చిత్రం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ‘కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత’ అన్నట్టుగా చౌకబారు సంభాషణలతో, అసభ్య ఆంగిక వాచకాలతో చింతామణి నాటకాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే 1956 ప్రాంతంలో నిర్మించబడిన భరణీవారి ‘చింతామణి’ చిత్రం ఎంతో ఉదాత్తంగా , హృద్యంగా చిత్రీకరించబడింది. చింతామణి పాత్రను భానుమతిని దృష్టిలో పెట్టుకుని భక్తురాలిగా మారిన పరిణతి చెందిన వేశ్యగా ఉదాత్తంగా చిత్రీకరించారు. ఎన్టీరామారావు (బిళ్వమంగళుడు), జమున (రాధ), ఎస్‌విరంగారావు (్భవానీ శంకరుడు), రేలంగి వెంకట్రామయ్య (సుబ్బిశెట్టి), రఘురామయ్య (శ్రీకృష్ణుడు), వి.కామరాజు (వాసుదేవమూర్తి), దేవి (చిత్ర), ఎ.నారాయరావు (దామోదరుడు), ఛాయాదేవి (మణి), ఋష్యేంద్రమణి (శ్రీహరి) ప్రభృతులు తమ అసమాన నటనా ప్రతిభతో రక్తికట్టించారు. టివిరాజు నేపథ్య సంగీతాన్ని, అద్దేపల్లిరామారావు సంగీతాన్ని అందించగా భానుమతి సంగీత పర్యవేక్షణ వహించారు. రావూరి వెంకట సత్యనారాయణరావు గీతరచన చేయగా శ్రీ్ధర్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ చిత్రానికి నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను పి.రామకృష్ణ చేపట్టారు. 11 ఏప్రిల్ 1956న విడుదలైన ‘చింతామణి’ చిత్రం 55 వసంతాలను పూర్తి చేసుకున్న ఓ కళాఖండం.

ఈ సినిమాలోని అద్భుతమైన రావోయి రావోయి ఓ మాధవా పాట కింద చూడండి.

1 వ్యాఖ్య:

 1. రావోయి రావోయి ఓ మాధవా
  అందాల రాధ అలిగిందీవేళ
  రావోయి రావోయి ఓ మాధవా

  పొదరింటి నీడలలో పొంచింది రాధ
  ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
  ఇంత జాగేల మురళిమోహన
  వేగ రావోయి రావోయి ఓ మాధవా
  అందాల రాణి అలిగిందీవేళ
  రావోయి రావోయి ఓ మాధవా

  ఊదుమురా యమునావిహారీ నీ మురళి
  ఊగునురా నీ రాధ ఆనందడోల (ఇంత జాగేల)

  తన ప్రేమ వేణువులో దాచింది రాధ
  అనురాగ రాగసుధ అందించవేల (ఇంత జాగేల) --రావూరి వెంకట సత్యనారాయణరావు భానుమతి,అద్దేపల్లి రామారావు, చింతామణి1956

  ప్రత్యుత్తరంతొలగించు