చిత్రమాలిక

6, అక్టోబర్ 2010, బుధవారం

ప్రతిభామూర్తి భానుమతి

చలనచిత్ర పరిశ్రమలోనూ, సాహితీరంగంలోనూ విశిష్ఠమైన వ్యక్తి భానుమతీరామకృష్ణ. అందువల్లనే ఆల్‌రౌండర్‌ కాగలిగారు. తొలుత తన 13వ ఏటనే తండ్రి నుంచి సంగీతాన్ని అభ్యసించారు. సినీరంగంలోకి అడుగిడినా చాలకాలం తండ్రికూచిగానే వ్యవహరించారు. 14వ ఏట 'వరవిక్రయం' చిత్రంలో నటిగా చిత్రరంగ ప్రవేశం చేసారు. అసిస్టెంట్‌ డైరక్టర్‌ రామకృష్ణని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పరుల సహకారంతో పెళ్ళి అయ్యాక సాధారణంగా గృహ జీవితంలో తృప్తిపడతారు మహిళలు. భానుమతి అలాకాకుండా నటనను కొనసాగించారు కొంత గ్యాప్‌ యిచ్చి.

భరణి సంస్థను నెలకొల్పి 'రత్నమాల' చిత్రాన్ని తొలిసారిగా నిర్మించి 1947లో విడుదల చేసారు. భరణి స్టూడియోస్‌ని నెలకొల్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. పాటలు పాడారు. అంతేకాదు సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, చిత్రకారిణిగా, జ్యోతిష్కురాలిగా ప్రజ్ఞా పాటవాలు చూపారు. ఇక రచయిత్రిగా అత్తగారి కథలు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డుని పొందింది. 'నాలో నేను' అనే స్వీయ చరిత్ర ఉత్తమ జీవితచరిత్రగా కేంద్రప్రభుత్వం నుంచి అవార్డుని తెచ్చింది.

మద్రాసు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. ఆ ప్రభుత్వం నుంచి కలైమామణి బిరుదునీ పొందారు. రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు 'డాక్టరేట్‌'తో గౌరవించాయి. 1999లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం న్యాయ నిర్ణేతల సంఘ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. భానుమతి జయంతి సెప్టెంబరు 7.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి