చిత్రమాలిక

2, ఏప్రిల్ 2009, గురువారం

సినిమా ప్రేమ కాదు

రామకృష్ణతో భానుమతి పెళ్ళి కథ ఒక సినిమాకు తీసిపోదు.ఆమె నటించిన అయిదో చిత్రం కృష్ణప్రేమ కు రామకృష్ణ అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసేవారు.అందరితోనూ మంచివాడనిపించుకున్న రామకృష్ణ,అప్పటికింకా పద్దెనిమిదేళ్ళు నిండని భానుమతి దృష్టిని ఇట్టే ఆకర్షించారు.స్టూడియోలో ఆయన ఎటు తిరిగితే అటే తిరిగేవి ఆమె చూపులు.ఇది గమనించిన అలనాటి నటులు శాంతకుమారి,హైమవతి ఆమెను ఆట పట్టించడానికి ఒక ప్లాను వేసారు. ఒకరోజు రామకృష్ణకోసం వెతుకుతూ అతను వెళ్ళిపోయి వుంటాడని తమలో తాము అనుకున్నారు.వెళ్ళలేదు భోజనం చేస్తున్నారు అని భానుమతి చెప్పింది. కాదు వెళ్ళిపోయారంది హైమవతి. ఇద్దరూ రెండు రూపాయలు పందెం వేసుకున్నారు. తీరా చూస్తే రామకృష్ణ నిజంగానే భోజనం చేస్తున్నారు.శాంతకుమారి,హైమవతి నర్మగర్భంగా నవ్వుకుని ఆ రెండు రూపాయలనీ రామకృష్ణతో ఇప్పించారు.

మరోసారి అదే సినిమా షూటింగులో భానుమతి వేలికి గులాబి ముళ్లు గుచ్చుకుంది.కట్టు కట్టడానికి తడిగుడ్డ దొరుకుతుందేమోనని చూస్తుండగా రామకృష్ణ ముందుకొచ్చి తన కర్చీప్ కట్టారు.కాలక్రమలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.భానుమతి తల్లితంద్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ వాళ్ళకు తెలియకుండా బంధువులు,స్నేహితుల సాయంతో పెళ్ళి చేసుకున్నారు.ప్రపంచానికి ఎంత తలబిరుసుగా కనిపించినా,కట్టుకున్న భర్తకు మాత్రం ఆమె ఎప్పుడూ అనుకూలవతిగానే వున్నారు.తమ ప్రేమకు చిహ్నాలుగా ఆయన తన వేలికి కట్టిన కర్చీఫ్,పందెపు సొమ్ము రెండు రూపాయలు కడదాకా భద్రంగా దాచుకున్నారామె.

1 వ్యాఖ్య:

  1. అప్పుడెప్పుడో జెమిని టీవీలో ఆవిడ స్వీయదర్శకత్వంలో వచ్చిన
    సీరియల్ చూసేదాన్ని. అప్పుడు తెలిసింది ఆవిడది ప్రేమవివాహం అని.
    ఆవిడ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నందుకు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు