చిత్రమాలిక

12, మార్చి 2009, గురువారం

భానుమతి గారి గురించి తనికెళ్ళ భరణి

ఆమెకూ సినిమాకూ 70 ఏళ్ల అనుబంధం..! చిన్న వయసులోనే వెండితెరపై వెలిగిపోయిందామె. నటన, గాత్రం, రచన, దర్శకత్వం.. సినిమా నిర్మాణం.. ఇలా ఒక్క రంగం కాదు.. ఒక విభాగమని కాదు.. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. తెలుగునాటే కాదు.. తమిళనాడులోనూ ఆదరణ పొందింది. ఓ మధ్యతరగతి మహిళ ఇన్ని రంగాల్లో విజయబావుటాలు రెపరెపలాడించిందంటే ఎంత ధైర్యం కావాలి. ఎంత తెగువ కావాలి.. ఎన్ని కష్టాలకోర్చాలి.? అందుకే ఓ సందర్భంలో ఆమె నాకు రాళ్లూపూలూ రెండూ కొత్త కాదని గట్టిగా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించిన నటి… ధీశాలి భానుమతి. తెలుగు చిత్రసీమ భాగ్యమతి! ఆమె బహుముఖ ప్రజ్ఞ… నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాటల్లో…


దిషణాహంకారం - నీకలంకారం
నీ పలుకుల నిండా కొరివికారం
కోపం నీకు వజ్రాల ముక్కుపుడక
సంగీత సాహిత్యాలు నీ చెవులకి లోలకులు
నీ చూపు చురకత్తి- నీ నవ్వు పూలగుత్తి
నువ్వు ఒక మతివి కావు శతమతివి
చిత్రసీమకు నువ్వో భారమితివి
కథానాయికల మార్గంలో నువ్వొక నూతన గతివి
నువ్వు భద్రకాళిలా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగిగోవువి
నువ్వు ఆడ హీరోవి!!
నువ్వు సంగీతం సంగతుల్లో పక్కా శృతివి
నటనలో మాత్రం అప్పుడప్పుడూ కొంచెం అతివి
ఇవాళ నువ్వో స్మృతివి
కానీ సినీ వినీలాకాశంలో
నువ్వు అస్తమయంలేని
‘భాను’మతివి-
(కురియు మా కన్నీరు గుండెలో దాచుకొని ఆమె ఆత్మను తడిపి రావా…)


మూలం: ఒరిజినల్ పోస్ట్ ఇక్కడ చూడండి
credit goes to: చంద్రశేఖర్ వల్లభనేని గారు

1 కామెంట్‌:

  1. నేను కూడా భానుమతి గారి అభిమానిని.
    "నీ పలుకుల నిండా కొరివికారం
    కోపం నీకు వజ్రాల ముక్కుపుడక"
    ఎంతో నిజం ఉంది ఈ మాటల్లో.
    మంచి మాటలు పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి