చిత్రమాలిక

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది - మూడవ భాగం

ఆమె చిన్నతనంలో పల్లెల్లో పెరిగిన మనిషి.ఆమె తండ్రి గారిది వ్యవసాయం.పశువులు,ఆవులు పుష్కలంగా వుండేవి.చిన్ననాటి అలవాట్లు మరచిపోలేక ఆమె ఇంట్లో ఆవుపాలు,ఆవునెయ్యి మాత్రమే వాడేవారు.అందుకు ఎప్పుడూ ఇంటి వెనుక రెండు ఆవుల్ని మేపుతుండేవారు.అంతే కాదు భరణీ స్టూడియో చాలా పెద్దది కదా.సగంలో స్టూడియో కట్టి మిగతా సగంలో పెద్ద ఇల్లు కట్టి,ఆవుల్ని మేపటమే కాకుండా వ్యవసాయం చేసి ఇంటికి సరిపడా ధాన్యం పండించేవారు.మామిడి చెట్లు పెంచి,వేసవికాలం కాయలు కోసి స్వయంగా ఆవకాయపెట్టి జాడీలతో మాలాంటి స్నేహితుల ఇళ్ళకు పంపేవారు.ఆవుల విషయం అత్తగారి కథల్లో కూడా రాశారు.

స్టూడియోలోని ఇంట్లోనుంచి తిరిగి త్యాగరాయనగరు వైద్య రామయ్యర్ వీధిలోని ఇంటికి మారేవరకు వారి ఇంట్లో ఆవుపాలు ఆవునెయ్యి ఆవుపెరుగు.వైద్య రామయ్యర్ వీధిలోని ఇంట్లో తగినంత వసతిలేక ఆవుల్ని అమ్మేశారు.అందరిలాగే గేదె పాలకు అలవాటుపడ్డారు.

1968 ప్రాంతంలోననుకునటాను..." నరసరాజుగారూ! నా జీవిత కథే ఎందుకు సినిమాగా తీయకూడదు " అన్నారు ఆమె నాతో. నేను కాసేపు ఆలోచించి " అవును తీయవచ్చు అన్నాను. " ఒక వృత్తి కళాకారిణికి బిడ్డనుగన్న తల్లికి మధ్య సంఘర్షణ.మంచి థీం. ఆ సందర్భంగా ఆమెగారి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలు చెప్పారు.

భానుమతిగారికి ఒక్కడే కొడుకు - భరణి.భరణి ఇంకా తల్లిపాలు విడువని వయసు. ఆ రోజుల్లో లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న బహు కొద్దిమందిలో భానుమతి ఒకరు.పొద్దున 6 గంటలకు షూటింగుకు వెళితే తిరిగి రాత్రి ఏ 9 - 10 గంటలకో ఇల్లు చేరడం.ఉదయం వెళ్ళేటప్పుడు రాత్రి వచ్చేటప్పటికి బిడ్డ నిద్రపోతుంటాదు.అప్పుడప్పుడే వచ్చీరాని మాటలు చెప్పే వయసు.బిడ్డ ముద్దుమాటలు వినే అదృష్టం లేదే అని బాధ.

అంతకంటే బాధ అది బిడ్డలుగన్న తల్లులకే తెలుస్తుంది.షూటింగులో చిన్న చిన్న వేషాలు వేసే మహిలలు, పిల్లతల్లులు షాట్ షాట్‌కి మధ్యలో చాటుకి వెళ్ళి బిడ్డకి పాలు ఇచ్చి వస్తుండేవారట.అది చూసి అయ్యో ఆ భాగ్యం నాకు లేదే అని ఈమెకు బాధ.పైగా పాలిండ్లలో నొప్పులు.

ఇవి చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లేవి.కథ చాలావరకు తయ్యారుచేశాం. కానీ కాస్టింగ్ కుదరక ఆపేయాల్సి వచ్చింది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి