భానుమతిగారి గురించి డి.వి.నరసరాజు గారు ఈనాడు ఆదివారంకోసం వ్రాసిన కవర్‌స్టోరీ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది నుంచి మొదటి భాగం.
పాత్రలో జీవించడమే నటనకు గీటురాయి.కానీ భానుమతి తన పాత్రను చంపి జీవిస్తారనేది విమర్శ. అబద్ధమనలేం.
సినిమా విజయంలో నటుల పాత్ర కచ్చితంగా ఉంటుంది.అయితే భానుమతి ఉన్న సినిమాలు కేవలం ఆమె మూలంగానే విజయం సాధించాయనేది ప్రశంస. అతిశయోక్తి అనలేం.
ఈ రెండు వైరుధ్యాలు సారాంశం?
ప్రేక్షకులు ఆవిడ పాత్రల్ని చూడటానికి కాదు.ఆవిడను చూడటానికే వచ్చేవారు.చురకత్తి చూపు,దోసగింజ బొట్టు,కంఠంలో అధికారం,మాటవిరుపున వెటకారం..పాత్ర ఏదైనా ఫార్ములా ఇదే.గిట్టనివాళ్ళు పొగరన్నా, అది ఆమె వ్యక్తిత్వంలో పవరు. అందుకే స్టార్లు లేని ఆ రోజుల్లోనే స్టార్ అట్రాక్షన్ భానుమతి సొంతం. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో ఓనర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా అష్టావధానం చేస్తూనే వ్యక్తిగత ఆనందాన్ని సంపూర్ణంగా పొందిన భానుమతి సినీ జీవితంలోనే కాదు సిసలు జీవితంలోనూ సూపర్‌స్టారే.
ఆమెకు అత్యంత సన్నిహితులైన రచయిత డి.వి.నరసరాజు నోట ఆమె గురించిన కొన్ని విషయాలు.
తన ఆత్మకథ ' నాలో-నేను ' కు ' ముందు మాట ' రాయమని అడిగారు భానుమతిగారు రాశాను.ఆ పుస్తకం ఒక కాపీ నాకు ఇచ్చారు.అందులో మొదటి పేజీలో స్వహస్తంతో ఇలా రాసారు.
'సహొదరులు శ్రీ డి.వి.నరసరాజు గారికి గౌరవ పురస్సరంగా - భానుమతీ రామకృష్ణ '
అలా మాది అన్నచెళ్ళెళ్ళ అనుబంధం.
ప్రఖ్యాత భావకవి కీ.శే. శ్రీ బసవరాజు అప్పారావు తన కుమారుడు చిన్న వయసులోనే పోయినప్పుడు హృదయ విదారకమైన ఓ గేయం రాసారు. అందులో గుండెలు పిండేసే ఒక లైన్.
"ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు"
ఈ ఒక్క వ్యాక్యం చాలు అతడు మహాకవి అనడానికి అనేవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
అలాగే ఇప్పుడు నా చెల్లెలు భానుమతి ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది.
1956 లో భరణీ పిక్చర్స్ వారు ' గృహలక్ష్మి ' సినిమా తీసారు.దానికి నేను సంభాషణలు రాసాను.అదే భరణీ పిక్చర్స్‌కు నేను రాసిన మొదటి చిత్రం. అదివరకు భానుమతి-రామకృష్ణగార్లతో పరిచయం ఉన్నా అది పలకరింతలవరకూ మాత్రమే.' గృహలక్ష్మి ' తర్వాత క్రమంగా అనుబంధం పెరిగి ఆ కుటుంబానికి సన్నిహితుడనయ్యాను.
భానుమతిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందరకూ తెలుసు.కానీ ఆమెలో ఉన్న ప్రత్యేకతలు చిన్న చిన్న బలహీనతలు - ఆ కుటుంబానికి సన్నిహితుణ్ణి గనక నాకు తెలుసు.
ఆమెకు బల్లి అంటే చచ్చే భయం. సినిమాలలో వేసే వేషాలు,రాసే రాతలు,ఇతరులు చెప్పుకునే కథలను బట్టి ఆమె చాలా ధైర్యశాలి అనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో నమ్మలేనంత పిరికి.
ఒకరోజు డ్రాయింగు రూంలో కూర్చుని మాటాడుకుంటున్నాం. నేను,ఆమె,రామకృష్ణగారు.ఆమెకు ఎదురు గోడ మీద బల్లి కనపడింది. కెవ్వున కేక వేసి ఎగిరి గంతువేసి,పక్క గదిలోకి పారిపోయి,నౌకరును గట్టిగా పిలిచి, అతను ఆ బల్లిని బయటకు తోలేదాకా ఆమె తిరిగి డ్రాయింగు రూముకి రాలేదు. రామకృష్ణగారు నేను ఒకటే నవ్వు.ఆమెకు మాత్రం పది నిమషాలవరకు గుండెదడ ఆగలేదు.
మనం విశిష్టవ్యక్తుల గురించి చదువుకోవటంలో రెండు మూడు కోణాలున్నాయి. వారు విజయవంతమైనదో, ఆదర్శవంతమైనదో ఒక వేళ రెండు విధాలుగానూ గుర్తించదగినదో అయిన జీవితాన్ని గడిపిన వారు. సామాన్యంగా మన విజయాలు ఆదర్శాలు వగైరా కొవ్వొత్తి వెలుగుల కన్నా వారి దేదీప్యమానకాంతి పరిధి చాలా హెచ్చు. భౌతికంగా మనలాగే ఉండే అలాంటి వ్యక్తులు అంతటి వెలుగుజిమ్మే స్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదటి కోణం. అటువంటి వారి గురించి చదవటానికి. ఏ విద్య అయినా ఎంతో కొంత వంట బట్టించుకుందుకే గదా నేర్చుకునేది? అలాంటి 'ఎరుక గల'వారి చరిత్రలు చదవటం వలన వారిలాగా మరింత రాణించే జీవితం యెలా గడపవచ్చో తెలుసుకోవచ్చునన్న ఆశ రెండవ కోణం. ఒక జాతిని ఒకటి లేదా కొన్ని రంగాలలో ప్రభావితం చేసి సాంస్కృతిక సామాజికాది రంగాలకు ఉత్తేజాన్నిచ్చిన వారికి మనం ఋణం తీర్చుకునే కనీస విధానం వారిని గురించి సరిగా తెలుసుకోవటం అనేది మూడవ కోణం. కాలక్షేపం వెనుక పరిగెడుతున్న తెలుగుజాతి ఈ మూడవ కోణంలో ఆలోచిస్తున్న దాఖలాలు నాకు యిటీవల కనబడటం లేదు! వర్తమానం అనేది గతం యొక్క భుజాల పైన నిలబడి భవిష్యత్తులోకి తొంగిచూస్తూ ఉంటుంది యెప్పుడూ. ఆ సంగతి మరిచి పోతే యెలా?
రిప్లయితొలగించండిశ్రీమతి భానుమతి గారి గురించి తెలుసుకుని తీరాలి మనవాళ్ళు. జాతి సిగ్గు పడవలసిని కొత్తిమీర మొక్కల స్థాయి వ్యక్తులకు మఱ్ఱి చెట్టు స్థాయి బిరుదులను తగిలించి గోల చేసే యీ నాటి కుఱ్ఱ్తతరాలకు అసలైన కాంతిశిఖరాల పరిచయం చాలా అవసరం.
ఈ బ్లాగుకు హృదయపూర్వక ఆహ్వానం.