చిత్రమాలిక

15, ఆగస్టు 2011, సోమవారం

మట్టిలో మాణిక్యం


చలం నిర్మాతగా తీసిన చిత్రాల్లో బాగా హిట్ అయి అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టిన చిత్రం ‘మట్టిలో మాణిక్యం’.
నిజానికి ఆ చిత్రం 16 రీళ్లు పూర్తయిపోయింది. అయితే ఆ చిత్రాన్ని ప్రీవ్యూలో చూసిన శ్రీ ఫిలిమ్స్ చంద్రశేఖరం కథ బాగాలేదు. భానుమతికి ప్రాధాన్యత ఉండేట్టు కథ మార్చండి. ఆమెపేరు పాత్ర ఉంటేనే నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను’ అన్నారు.
వెంటనే చలం భానుమతితో ‘‘అమ్మా! మీరు రచయిత్రి! ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్టు మీ ముందు పెడుతున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేయండి! కథ ఎలా వౌల్డ్ చేస్తారో మీ ఇష్టం. మీరు మీ పాత్ర ప్రాధాన్యత పెంచుకోండి, మీరు ఈ చిత్రంలో ఉండాలి. మీతోపాటు జమున ఉన్నారు. రచయిత రాజశ్రీ, డైరక్టర్‌లను మీ దగ్గరకు పంపుతాను!’’ అన్నాడు.
పాత కథలోరెండు రీళ్ల తల్లి పాత్రను ఏడు రీళ్ల వదిన పాత్రగా మార్చి కథ మొత్తం దాదాపు తిరగ రాసారు. అది రచయిత రాజశ్రీ, డైరక్టర్ బివి ప్రసాద్‌లకు చెప్పి ఆమె నటించారు. భానుమతిగారు ఆ చిత్రం షూటింగ్‌లో సెట్‌లో అప్పటికి తోచిన హాస్య సంభాషణలు చెప్పి అదనంగా తీయించేవారు.
ఇలా కూర్చడంవల్ల నటీనటులు కొత్త డైలాగులు చెప్పాల్సి వచ్చేది. అయినా సహకరించారు. భానుమతిగారి చెయ్యి పడడంవల్ల హాస్య సన్నివేశాలు పెరిగాయి. హాస్యం బాగా పండింది. తక్కిన నటీనటులు వాళ్లషూటింగ్ పూర్తయినా సెట్‌బయట దగ్గరగా ఉండి హాస్య సన్నివేశాలను ఎంజాయ్ చేసేవారు.
అలా భానుమతిగారి ప్రతిభతో ‘మట్టి’గా మారిన ఆ చిత్రాన్ని ‘మాణిక్యం’ చేశారు. ఇక ఈ చిత్రం విడుదలయ్యాక అది సూపర్ డూపర్ హిట్టయింది. భానుమతి నటనకు, ఛాయాదేవిని ఆమె కథలో కంట్రోల్ చేసిన విధానానికి భానుమతికే ఎక్కువ క్రెడిట్ దక్కింది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి