17, జూన్ 2011, శుక్రవారం
నాలో నేను - 5
"అత్తగారి కథలు" రాయడం సరదాగా ప్రారంభించాను. ముళ్ళపూడి వెంకటరమణ బాగా ఎంకరేజ్ చేశేవారు. ఆ కథలకు స్ఫూర్తి మా అత్తగారే. కానీ సంఘటనలన్నీ నిజంకావు. కొన్ని కల్పించినవి. వాతావరణానికి మా ఇళ్ళు బేస్‌గా పెట్టుకున్నాన్ను అంతే. పైగా కొన్ని నాకు జరిగిన సంఘటనలు ఆవిడకు ఆపాదించాను. ఉదాహరణకు "అత్తగారు-బాల్‌పాయింటు" సాక్షాత్తు నా అనుభవమే. చక్రపాణి గారు నడిపిన "యువ" పత్రికకు ప్రతి దీపావళికి నేనొక కథ ఇవ్వాల్సిందే. అదొక నియమం.
కవిత్వం, కథల తర్వాత చాలా ఇష్టమైనది పెయింటింగ్ చేయడం. ఎన్నో వేశాను. బావున్నాయంటారంతా. బాగుంటాయని నాకూ తెలుసు. ఆ తర్వాత వ్యవసాయం అన్నా ఇష్టమే. మనం వేసిన విత్తనాలు మొలకెత్తి, చెట్లై, పూలు పూసి, కాయలు కాసి ఆ వైభవం చూసినప్పుడు నాకు అందులో మరకత మీనాక్షి దర్శనమిస్తుంది.
పెర్ల్.ఎస్.బక్ రాసిన ' మై సెవరల్ వరల్డ్స్ ' అనే నవల అనువాదం చేశాను. ఆవిడ రచనలంటే నాకు చాలా ఇష్టం. ' నో మ్యాన్ వాంట్స్ ఏ గాడెస్ టు బి హిజ్ వైఫ్ ' అన్న ఆవిడ కొటేషన్ మావారికి చాలా ఇష్టం. ఆడదాన్లో కొంచం అజ్ఞానం, అమాయకత్వం ఉంటేనే మగవాడు భరిస్తాడు. అంతేకానీ ఇంటెలెక్చువాలిటీతో నిర్మొహమాటంగా ముందుకు సాగిపోయే స్త్రీ మూర్తిని భరించలేడు. ఇది నాకు తెలిసిన సత్యం. అందుకే ప్రపంచాన్నే శాసించిన నేను మావారి వెనకాలే నడిచాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి