చిత్రమాలిక

14, మార్చి 2011, సోమవారం

షష్ఠి పూర్తి ముంగిట్లో మల్లీశ్వరి


1951లో ఎన్.టి.రామారావు,భానుమతి నటించిన ‘మల్లీశ్వరి’ (డిసెంబర్ 20) విభిన్న కోణాల్లో చిరస్మరణీయమైన ఆణిముత్యంగా నిలిచిపోయింది. అరవై ఏళ్ల కిందట విడుదలైనా నేటికీ రసజ్ఞ ప్రేక్షక లోకానికి తీయని అనుభూతులు అందిస్తూనే ఉంది. క్లాసిక్స్ అన్న మాటకు నిర్వచనం మల్లీశ్వరి.

వాహిని వారి చిత్రం ‘మల్లీశ్వరి’.ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు బి.ఎన్.రెడ్డి.
మల్లీశ్వరి చిత్రానికి మాటలు, పాటలు రాసి సినీ రంగ ప్రవేశం చేసారు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, సంగీతాన్ని సాలూరు రాజేశ్వరరావు అందించగా సహకరించారు అద్దేపల్లి రామారావు. కెమెరా ఆది యం.ఇరాని, బి.ఎన్.కొండారెడ్డి.
చారిత్రక నేపథ్యం కల ‘మల్లీశ్వరి’ చిత్రానికి రాయలనాటి కాలం గుర్తుకు వచ్చేలా సెట్టింగ్స్ రూపొందించారు ఎ.కె.శేఖర్.
మల్లీశ్వరి చిత్రానికి బుచ్చిబాబు రాసిన రేడియో నాటిక ‘రాయలవారి కరుణకృత్యం’, ఇలస్టేటెడ్ వీక్లీలోని మరో కధ.

కథా కథనాలు:

వీరాపురంలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ. ఆ కుటుంబాలకు చెందిన అన్నా చెల్లెళ్ల పిల్లలు నాగరాజు, మల్లీశ్వరి. బావ మరదళ్లు చిన్నతనంనుంచి అన్యోన్యంగా పెరిగారు.
ఓరోజు సంతకు వెళ్లి తిరిగి వస్తూ వర్షంవల్ల ఓ సత్రంలో తలదాచుకుంటారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. మారువేషంలో అదే సత్రంలో ఆగిన శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. తెలియక అమాయకత్వంతో వారిని విజయనగరంనుంచి రాణివాసం పల్లకి పంపమని కోరతాడు నాగరాజు.
మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించడం కోసం నాగరాజు ఊరువిడిచి వెడతాడు. ఈలోగా పల్లకి వచ్చి మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లిపోతుంది. తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుంచి ఆ మరునాడు తప్పించుకుని వెడదామని అనుకుంటారు. ఎంతకూ రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరి బంధిస్తారు సైనికులు.
అందుకై మరణశిక్ష పడవలసి వున్నా, రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో ప్రేమకథ సుఖాంతమవుతుంది.

నటీనటులు:

ఈ చిత్రంలో కథానాయకుడు రామావు. విషాద భావ ప్రకటనకు అవకాశం ఎక్కువ. ఈ పాత్ర సానబట్టిన వజ్రంగా ఎన్టీఆర్‌ను మలిచింది. మల్లీశ్వరి నాయిక భానుమతి ఎన్నో షేడ్స్ కూడిన పాత్రకు తన గానం, అభినయంతో ప్రాణం పోసారు.
మల్లీశ్వరిలో, మల్లీశ్వరి ఇష్ట సఖిగా నాగరాజు, మల్లీశ్వరిని కలిపే ప్రయత్నంలో ‘ఝుం, ఝుం, ఝుం తుమ్మెదా’ అంటూ నటిస్తూ, గానం చేసారు. తొలి తెలుగు కథానాయిక సురభి కమలాబాయి పాతాళ భైరవిలో తోటరాముని తల్లిగాను, మల్లీశ్వరిలో పొరుగింటి ఇల్లాలు ‘బసక్క’గాను నటించారు.

సంగీత సాహిత్యాలు:

మల్లీశ్వరి మాటలు పాత్రోచితంగా గంభీరంగా ఉంటాయి. మల్లీశ్వరి చిత్రంలో సినీ గీతాలకు కావ్య గౌరవం లభించిందని ప్రశంసించారు తాపీ ధర్మారావు. చిత్ర గీతాలన్నీ రసజ్ఞ శ్రోతల హృదయాలను అలరిస్తున్నాయి. ‘కోతి బావకుపెళ్లంట’, ‘పరుగులు తీయాలి’, ‘పిలిచిన బిగువటరా’, ‘మనసు తెలిసిన మేఘమాలా’,‘ఔనా నిజమేనా’, ‘ఎందుకే నీకింత తొందర‘, ‘నెలరాజా’ ఇవన్నీ ఒక ఎత్తు, ‘మనసున మల్లెల మాలలూగెనే’ మరో ఎత్తు. ఆ గీతాలు ఉదాత్త రచనతో సముదాత్త సంగీతంతో ఘంటసాల, భానుమతి గానంతో చిరంజీవులైనాయి.

ఈ చిత్రానికి పనిచేసిన వారిలో చాలామంది కీర్తిశేషులు కాగా ఇందులో నటించిన టి.జి.కమలాదేవి చెన్నైలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.

1 కామెంట్‌: