చిత్రమాలిక

11, జనవరి 2011, మంగళవారం

నాలో నేను - 2




నాకు మధ్య తరగతి జీవనమే ఇష్టం. పెళ్ళైన కొత్తలో మాంబళం (మద్రాసు) మహాలక్ష్మి స్ట్రీట్ ఇంటి నెంబరు 12లో ఉండేవాళ్ళం. పదిహేను రూపాయలు అద్దె. ఆ రోజుల్లో మేమిద్దరం చూసిన ఇంగ్లీష్, హిందీ సినిమాలు, తిన్న ఐసుక్రీములు , తిరిగి ఇంటికి రావడానికి మౌంట్ రోడ్డులో పదకొండో నెంబరు బస్సుకోసం వెయిట్ చేయడం, అది రాకపోతే మళ్ళి సినిమాకెళ్ళడం ఇప్పటికి నా స్మృతి పధంలో మెదులుతాయి. ఈ రోజుల్లో కార్లు, బంగళాలు ఇవ్వలేని సుఖశాంతులు ఆ రోజులు నాకందించాయని ఇప్పటికీ నమ్ముతుంటాను.

రామారావుగారంటే నాకు చాలా గౌరవం. చాలాసార్లు నా దగ్గర సలహాలు తీసుకొనేవారు.నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినప్పుడు నా చేతికి బంగారు కంకణాన్ని తోడిగారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాదులో నన్ను ఘనంగా సన్మానించారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వచ్చిందంటూ పిల్లలందరినీ పిలిచి కాళ్ళకు నమస్కారం చేయించేవారు.

నాకు మొదటినుంచి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం. మా సొంత సినిమాల్లో కచ్చితంగా క్షేత్రయ్య పదమో, త్యాగరాజ కీర్తనో, జయదేవాష్టపదో పెట్టేదాన్ని. అది నేను మా నాన్నగారికి చేసిన వాగ్దానం. అదొక శాసనంగా తీసుకున్నాను. త్యాగరాజ కీర్తనలు సినిమాల్లో పెడితే ఎవరు చూస్తారు. సిగరెట్లకి బయటకు వెళతారు అని మా వారు విసుక్కునేవారు.

మరి కొన్ని సంగతులు తరువాతి టపాలో.

1 కామెంట్‌: