చిత్రమాలిక

2, జూన్ 2010, బుధవారం

కారణజన్మురాలు 'భానుమతి'

భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో భానుమతి రామకృష్ణ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లి కి చేసిన సేవలు అజరామరం.

భానుమతి పేరు వినగానే 'మల్లీశ్వరి', 'లైలా మజ్ఞు', 'విప్రనారాయణ', 'స్వర్గసీమ', 'బాటసారి' వంటి అద్భుత చిత్రాలు మన మదిలో మెదిలుతాయి. ఈ చిత్రాల్లో ఆమె నటన అజరామరం. 1925, సెపెంబరు 7న ఒంగోలులో భానుమతి గారు జన్మంచారు. సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేని భానుమతి అనుకోకుండా 'పరవిక్రయం' సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేసారు. 1943లో 'కృష్ణ ప్రేమ' చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1946లో ప్రముఖ దర్శకుడు శ్రీ బియన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'స్వర్గసీమ' చిత్రంలో ఆమె నటన ఓ అద్భుతం. ఈ చిత్రంలో ఆమె పాడిన ''ఓహో ఓహో పావురమా" పాట ఆమె చిరునామా అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

1947లో తన కుమారుడి పేరిట 'భరణి పిక్చర్స్' ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో 'రత్నమాల' అనే చిత్రాన్ని నిర్మించారు. 1953లో దర్శకురాలిగా మారి ఒకే సారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'చండీరాణి' అనే చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించారు. అంతే కాకుండా టైటిల్ రోల్ ఆమే పోషించడం అప్పట్లో ఓ సంచలనం. ఆమె ఎంత గొప్పనటో అంతే గొప్పగాయని. "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" అంటూ ఆమె స్వరం నుండీ జాలువారిన పాటలు నేటికీ అజరామరంగా నిలిచాయి.

తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన భానుమతి అందుకున్న గౌరవాలు, అవార్డులు అనేకం. 1966లో "పల్నాటి యుద్ధం", "అంతస్తులు" చిత్రాలకు గాను జాతీయ అవార్డును, 1964లో కళైమణి అవార్డుని, 1966లో కేంద్రప్రభుత్వ "పద్మశ్రీ", 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రఘుపతి వెంకయ్య అవార్డుని, 2001లో "పద్మ భూషన్", "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని...ఇలా ఎన్నో అవార్డులు పొంది సినీసీమను సుసంపన్నం చేసారు. భానుమతి గారిది ఓ విలక్షణమైన మనస్తత్వం. వింతైన ఆలోచనాధోరణి, రాళ్లను సైతం కరిగించగల స్వరం ఆమె సొంతం. అలాంటి కారణ జన్మురాలిని ఓ సారి స్మరించుకోవడం మన కనీసధర్మం.


---------ఈ ఆర్టికల్ థట్స్ తెలుగు నుండి గ్రహించడమైనది.-------------------

1 కామెంట్‌:

  1. నిజం చెప్పారండి. ఆవిడ మన తెలుగుచిత్రసీమలో ఉండటం మన అదృష్టం. అరకొర బట్టలతో, తెలుగు మాట్లాడటం రాని మన నటీమణులు ఈమెను చూసి సిగ్గుపడాలి.

    రిప్లయితొలగించండి