చిత్రమాలిక

31, మార్చి 2010, బుధవారం

బహుముఖ ప్రతిభాశాలి భానుమతి


1925 లో సెప్టెంబర్ 7 వ తేదీన, ప్రకాశం జిల్లాలోని దొడ్డవరం గ్రామంలో, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దపతులకు జన్మించిన ఆణిముత్యమే ఈ బహుముఖ ప్రతిభాశాలి భానుమతి. భానుమతి నటి, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టుడియో అధినేత్రి ఇలా అనేక రంగాల్లో సంచలనాలు స్రుష్టించిన తొలి తెలుగు మహిళ భానుమతి.తండ్రి వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత ప్రియుడు, రంగస్థల నటుడు కావటంతో భానుమతికి ఆయనే తొలి గురువు,నటనలో స్ఫూర్తి కూడా. ఆయనే ఆమెకు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గరుండి నేర్పించారు. ఆ తర్వాత 1935 లో , పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన "వరవిక్రయం" చిత్రంలో భానుమతి తొలిసారిగా నటిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు. తర్వాత మాలతీ మాధవం, ధర్మపత్ని, భక్తిమాల, క్రిష్ణప్రేమ, స్వర్గసీమ, చక్రపాణి, లైలామజ్ఞు, విప్రనారాయణ, మల్లీశ్వరి, బాటసారి, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అగ్గిరాముడు, తెనాలి రామక్రిష్ణ, అంతస్తులు, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే, అమ్మాయిపెళ్ళి, మంగమ్మగారి మనవడు వంటి రెండు వందల చిత్రాల్లో ఆమె నటించారు. భానుమతి నటించిన చివరి చిత్రం "పెళ్ళికానుక". .ఆమె సీన్ లో ఉంటే మరో నటి గానీ, నటుడు గానీ కనపడడనే వినికిడి సినీ పరిశ్రమలో ఉండేది. అందుకే ఆనాటి సినీ పరిశ్రమలో భానుమతికి "అష్టవర్థిని"అనే బిరుదుండేది. ఇక గాయనిగా ఆమె పాడిన పాటలు వందల్లో ప్రేక్షకులను అలరించాయి.
భానుమతి గారికి లభించిన గౌరవం కానీ, సన్మానాలు కానీ, అవార్డులూ, రివార్డులూ మరే తెలుగు నటికీ లభించలేదంటే అతిశయోక్తికాదు.పల్నాటి యుద్ధం చిత్రానికి గాను 1966 లో జాతీయ ఉత్తమనటిగా, అన్నై అనే తమిళ చిత్రానికి కూడా ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు, 1965 లో అంతస్తులు చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా లభించగా, 1966లో భారత ప్రభుత్వం "పద్మశ్రీ" అవార్డుతో గౌరవించగా,1975 లో ఆంధ్రా యూనివర్సిటీ, 1984 లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు అందించి గౌరవించాయి. 1983 లో తమిళనాడు ప్రభుత్వం "కళాఈమామణి" బిరుదునిచ్చి గౌరవించింది. 1986 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "రఘుపతివెంకయ్య నాయుడు "అవార్డుని భానుమతి గారికిచ్చి గౌరవించింది. 2000 సంవత్సరంలో యన్.టి.ఆర్.నేషనల్ అవార్డునిచ్చి గౌరవించగా, 2003 లో ఆమెకు భారత ప్రభుత్వం "పద్మభూషణ్ "అవార్డునిచ్చి గౌరవించింది.అటువంటి బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ భానుమతీ రామక్రిష్ణ 2005లో డిసెంబర్ 24 వ తేదీన పరమపదించారు. ఒక బ్రుహత్తార నేలరాలి, ఆకాశంలో ధ్రువతారగా నిలిచిపోయింది. తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం భానుమతికి చావులేదు. ఆమె అమరజీవి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.

-------------ఈ ఆర్టికల్ మాస్టార్స్ డాట్ కాం నుండి గ్రహించడమైనది.---------------

1 కామెంట్‌: