చిత్రమాలిక

29, జులై 2013, సోమవారం

ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది - నాలుగవ భాగం

ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భానుమతిగారిని ప్రభుత్వ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్‌గా నియమించారు.ఆ పదవిని ఆమె చాలా సమర్ధంగా నిర్వహించారని, ఒక సభలో ఎం.జి.ఆర్ ఆమెను అభినందించారు.

అంతకు ముందు సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నతను తెలుగులో ఉండే త్యాగరాయ కృతులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ కేవలం తమిళ వాగ్గేయకారులు పాపనాశం,శివం మొదలైనవారు రాసిన తమిళగీతాలే బోధింపచేసాడట.

అది తెలిసి భానుమతిగారు పాఠ్యాంశాలను సమూలంగా మార్చి త్యాగరాయ కృతులను తప్పనిసరిగా పాడేట్టు చేశారట. ఈ విషయం భానుమతిగారే నాతో చెప్పారు.భానుమతిగారికి ఆంధ్రదేశంలో ఎంత పేరుందో తమిళనాడులోనూ అంత పేరుంది. పేరు, గౌరవం కూడా ఉన్నాయి.

ఇతర నటీమణులలో లేని విశిష్ట గుణాలు ఆమెలో చాలా ఉన్నాయి. అంత ప్రఖ్యాత తార అయ్యి ఉండి కూడా సినిమాలో నటిస్తున్నప్పుడు వేసుకొనే మేకప్ తప్ప విడిగా ఇంట్లో ఉన్నప్పుడు గానీ,స్నేహితుల ఇళ్ళకు వెళ్ళేతప్పుడుగానీ ఆమె మొఖానికి టాల్కం పౌడర్ కూడా వేసుకొనేవారు కారు.సెంట్లు,అత్తరులు అసలు అలవాటు లేదు.ఈ విషయాలు చెబితే అందరూ నమ్మరు కానీ నిజం. ఆమె దగ్గర అలమారలో ఎప్పుడూ రెండు ముడు కంచిపట్టు చీరలో, జరీ నేతచీరలో ఉండేవి.ఎవరైనా గౌరవించదగినవారు వస్తే వారికి చీర పెట్టేవారు.

నాకు తెలిసి తెలుగు రచయిత్రులలో ఆమెకు సన్నిహితులు ఇద్దరు. ఒకరు మాలతి చందూర్,రెండోవారు శారదా అశోకవర్ధన్.

శారదా అశోకవర్ధన్ ' నేనూ భానుమతిగారు ' అని ఒక పుస్తకం కూడా రాశారు.భానుమతిగారికి మాలతి చందూర్ గారికి గురుశిష్య సంబంధం. మాలతి గారు భానుమతిగారిని గురూ అని సంబొధిస్తే ఆమె ఈమెను ఏం శిష్యా ఎలా వున్నావు అనేవారు.భానుమతిగారి ప్రతి జన్మదినంనాడు మాలతి చందూర్ దంపతులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం తప్పనిసరి.

1 వ్యాఖ్య:

  1. భానుమతి గారికి ఆత్మాభిమానం ఎక్కువ!ఎంత ఎక్కువ అంటే ఇతరులు గర్వంగా భావించేటంత ఎక్కువ!బహుముఖ ప్రజ్ఞాశాలి!ఏ ఇల్లూ ఎవరికీ శాశ్వతం కాదు!అందరం ఇళ్లు ఖాళీ చేసి ఎప్పుడో ఒకప్పుడు వెల్లిపోవలసిందే!

    ప్రత్యుత్తరంతొలగించు